వెంకటేష్,తేజ ప్రాజెక్ట్ డౌటే!

వాస్తవం ప్రతినిధి: నేనే రాజు నేనే మంత్రి చిత్రంతో భారీ హిట్ సాధించిన తేజ ఒకరకంగా రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టినట్లు అయ్యింది. దీనితో ఆయనకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమం లోనే ముందుగా ప్రముఖ హిరో వెంక‌టేష్‌తో క‌లిసి ఆట‌నాదే వేట‌నాదే ( వర్కింగ్ టైటిల్‌) అనే ప్రాజెక్ట్ చేయ‌నున్న తేజ‌, ఆ త‌ర్వాత ఎన్టీఆర్ బ‌యోపిక్ రూపొందించ‌నున్నాడు అని వార్తలు వచ్చాయి. స్క్రిప్ట్ పనుల్లో ఉన్నట్లు తెలిపిన తేజ ఫిబ్రవరి లోనే సినిమాని సెట్స్ పైకి తీసుకెళతానని ప్రకటించాడు కూడా. కానీ ఏప్రిల్ వచ్చినప్పటికీ ఇంతవరకు ఈ చిత్రం సెట్స్ మీదకు వెళుతుందా అనేదానిపై ఎలాంటి ప్రకటన కూడా లేదు. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళేందుకు మ‌రికొన్ని రోజులు ప‌డుతుంద‌ని కొంద‌రు అంటుంటే, మ‌రి కొంద‌రు ఈ సినిమా ప‌ట్టాలెక్క‌డం క‌ష్ట‌మేనేమో అని అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. ఎందుకంటే వెంకటేష్ సోద‌రుడు సురేష్ బాబు సెకండాఫ్‌లో కొన్ని మార్పులు చేయ‌మ‌ని కోర‌డంతో ప్ర‌స్తుతం అదే ప‌నిలో ఉన్నాడ‌ట తేజ‌. కాని మ‌రో వైపు వెంకీ.. వ‌రుణ్‌తేజ్‌తో క‌లిసి ఓ చిత్రం నాగ చైత‌న్య‌తో క‌లిసి మ‌రో చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. దీనితో ప్రస్తుతం ఈ రెండు చిత్రాలతో బిజీ గా ఉన్న వెంకీ ఈ చిత్రం చేయడానికి ఎంత సమయం తీసుకుంటాడో. అలానే మరోపక్క తేజ కూడా ఎన్టీఆర్ బయోపిక్ తో బిజీ గా ఉన్నాడు. ఈ నేప‌థ్యంలో వెంకీ-తేజ ప్రాజెక్ట్‌పై కాస్త సస్పెన్స్ నెల‌కొంది. అయితే దీనిపై తేజ ఏమైనా ప్రకటన చేస్తారేమో అనేది చూడాలి.