వివిధ పార్టీల నేతలను కలిసిన చంద్రబాబు!

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ఢిల్లీ వేదికగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎండగట్టారు. స్వయంగా పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌కు వెళ్లి వివిధ పార్టీల నేతలకు… రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ధోరణిని వారికి వివరించి వారి మద్దతును మూటగట్టుకున్నారు. ఏపీ కి ప్రత్యేక హోదా కాకపోయినా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పిన కేంద్రం అదిగో చేస్తాం… ఇదిగో చేస్తాం అంటూ ఇప్పటివరకు కాలయాపన చేస్తూ వచ్చిందని వారి మోసపూరిత వైఖరి వల్ల ఏపీ కి అన్ని విధాలుగా అన్యాయం జరిగింది అంటూ వారి వద్ద ఏకరువు పెట్టారు. దీన్ని సరిదిద్దేలా కేంద్రం పై ఒత్తిడి తేవడానికి సహకరించాలని వివిధ పార్టీల నేతలను చంద్రబాబు కోరారు. రెండురోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ కి వచ్చిన చంద్రబాబు మంగళవారం పార్లమెంటు సెంట్రల్‌హాల్‌ వేదికగా… అందరిముందే వివిధ పార్టీల ఉభయసభాపక్ష నేతలు, ఎంపీలతో వరుస భేటీలు జరిపారు. ముందుగా పార్లమెంటులో అడుగుపెడుతూనే గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం ప్రధాన ద్వారం వద్ద ఉన్న మెట్లకు దండంపెట్టి మరీ పార్లమెంటులోకి ప్రవేశించారు.