విన్నీ కి ఘన నివాళి అర్పించిన దక్షిణాఫ్రికా

వాస్తవం ప్రతినిధి: నల్లజాతి ‘సూరీడు’ నెల్సన్‌ మండేలా మాజీ భార్య, వర్ణవివక్ష ఉద్యమకారిణి విన్నీ మండేలా(81) గురువారం కన్ను మూసిన సంగతి తెలిసిందే. ఆమె మృతి పై దక్షిణాఫ్రికా ఘన నివాళర్పిస్తోంది.  ఫైర్‌బ్రాండ్‌ నేతగా గుర్తింపు పొందిన ఆమె సాగించిన స్ఫూర్తిదాయక పోరాటాలను గుర్తుచేసుకుంటూ ఆమెకు ఘన నివాళి అర్పించారు. దీర్ఘకాలంగా అస్వస్థతతో ఉన్న విన్నీ, జోహెన్నెస్‌బర్గ్‌లోని మిల్‌పార్క్‌ ఆసుపత్రిలో గురువారం కన్నుమూశారు. ‘జాతికి మాతృమూర్తి’గా ఆమెను ఆరాధిస్తుంటారు. ఆమె మృతి చెందడం తో ఈ నెల 11న ఆమె సంస్మరణ ప్రార్థన, 14న పూర్తిస్థాయి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రామాఫోసా పేర్కొన్నారు.  విపక్ష ఎకనామిక్‌ ఫ్రీడమ్‌ ఫైటర్స్‌ (ఈఎఫ్‌ఎఫ్‌) పార్టీ నాయకుడు, విన్నీ మండేలాకు అత్యంత విశ్వాసపాత్రుడైన జూలియస్‌ మలేమా, దక్షిణాఫ్రికాలో భారత సంతతి ప్రముఖులు ఆమెకు సంతాపం ప్రకటించారు. 1936 లో జన్మించిన విన్నీ మాడికిజెలా మండేలా, సామాజిక సేవలో శిక్షణ పొందారు. 1950లలో నెల్సన్‌ మండేలాతో పరిచయమై అది పెళ్లికి దారి తీసింది. దక్షిణాఫ్రికాలో వర్ణవివక్షపైన, మైనార్టీలైన శ్వేతజాతీయుల పాలనకు చరమగీతం పాడటానికి జరిగిన ఉద్యమంలో ఆమె భర్తతో కలసి పోరాటం చేశారు. వారి వైవాహిక జీవితం 38 ఏళ్లపాటు సాగింది. అయితే నెల్సన్‌ మండేలాను 27 ఏళ్ల పాటు కారాగారంలో ఉంచడంతో అంతకాలం పాటు వారు విడిగానే ఉండిపోయారు. ఇద్దరు కుమార్తెల బాధ్యతను విన్నీ తన భుజాలపై వేసుకున్నారు. ఉద్యమాన్నీ నడపించారు. జైలు జీవితాన్నీ గడిపారు. 1990లో నెల్సన్‌ విడుదలయ్యారు. ఆ తర్వాత రెండేళ్లకు వారు విడిపోయారు. అయితే చరిత్రలో విన్నీ స్థానం.. వివాదాలు, హింస ఆరోపణలతో మసకబారిపోయింది.