కాశ్మీర్ లో భారత్ అణచివేత చర్యలకు పాల్పడుతుంది: పాక్ ప్రధాని

వాస్తవం ప్రతినిధి: కాశ్మీర్‌ వ్యవహారంలో పాకిస్థాన్‌ మరోసారి తలదూర్చి తన అక్కసు వెళ్ళగక్కింది. కాశ్మీర్ లో అణచివేత చర్యలకు పాల్పడుతుంది అంటూ భారత్ పై ఆరోపణలను గుప్పించింది. పాక్‌ ప్రధాని షాహిద్‌ ఖక్కన్‌ అబ్బాసీ స్వయంగా ఆ ఆరోపణలకు దిగటం విశేషం. గురివింద గింజ తన కింద ఉన్న నలుపును చూడకుండా ఎదుటి వాటి నలుపు గురించి చెబుతుందట. సరిగ్గా పాక్ కూడా అలానే వ్యవహరిస్తుంది. సరిహద్దు లో నిత్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లఘిస్తూ కాల్పులు జరిపి ఎందఱో సరిహద్దు ప్రజల ప్రాణాలను బలిగొంటున్న పాక్ ఇప్పుడు కాశ్మీరు ప్రజలతో భారత సైన్యం దారుణంగా వ్యవహరిస్తోంది అని వ్యాఖ్యానించింది. వారిని మనశ్శాంతిగా ఉండనివ్వటం లేదని, అమాయకుల ప్రాణాలు బలి తీసుకుంటోంది అంటూ ఎదురు దాడికి దిగింది. అంతటితో ఆగకుండా ధర్నాలు, ఆందోళన చేపట్టే వారిపై పెల్లెట్‌ గన్‌లను ప్రయోగిస్తూ అణచివేత ధోరణిని ప్రదర్శిస్తోంది. స్వేచ్ఛ కోసం పోరాడే వారిని ఉగ్రవాదులుగా ముద్ర వేస్తోంది అని పేర్కొంటూ అబ్బాసీ ఓ ప్రకటన విడుదల చేయడం విశేషం. కావున అంతర్జాతీయ సమాజం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరిన ఆయన, నిజనిర్ధారణ కమిటీ ద్వారా కాశ్మీర్‌లోని పరిస్థితులపై అధ్యయనం చేపట్టాలని ఐకరాజ్యసమితిని కోరినట్లు తెలుస్తుంది. ఆదివారం వరుస ఎన్‌కౌంటర్లలో 13 మంది మిలిటెంట్లు హతమైన సంగతి తెలిసిందే. దీనితో దక్షిణ కాశ్మీర్ లో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. భద్రతా బలగాల తీవ్రవాదుల్ని మట్టుబెట్టడం తో నిరసన కారులు పోలీసుల మీదకు రాళ్లు రువ్వడం తో బలగాలు వారిపై కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో నలుగురు పౌరులు మృతి చెందగా,పలువురు గాయపడినట్లు తెలుస్తుంది. అయితే ఈ పరిణామాల అనంతరం పాక్ ప్రధాని అబ్బాసీ ఈ ప్రకటన చేయడం గమనార్హం.