పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ సంచలన నిర్ణయం….10 మంది ఉగ్రవాదులకు మరణ శిక్ష

వాస్తవం ప్రతినిధి: పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బాజ్వా సంచలన నిర్ణయం తీసుకున్నారు. సూఫీ ప్రబోధకుడు అంజాద్‌ సబ్రిని కాల్చిచంపిన ఘటనతో సహా తీవ్ర నేరాలకు పాల్పడిన పది మంది కరుడుగట్టిన ఉగ్రవాదులకు మరణ శిక్ష విధించేందుకు ఆయన ఆమోదం తెలిపినట్లు తెలుస్తుంది. భద్రతా దళాలపై దాడులతో పాటు పెషావర్‌లోని పెరల్‌ కాంటినెంటల్‌ హోటల్‌పై దాడి వంటి తీవ్ర నేరాలకు పాల్పడిన 10 మంది కరుడుగట్టిన ఉగ్రవాదులను మరణ శిక్ష విదించడానికి ఆయన అంగీకారం తెలిపారు. ఇప్పటి వరకు కేవలం విచారణ ను మాత్రమే ఎదురుకొంటున్న ఆ ఉగ్రవాదులను మరణ శిక్ష విదించడానికి ఆర్మీ చీఫ్ అంగీకరించారు. ఈ ఉగ్రవాదులను మహ్మద్‌ ఇషాక్‌, రఫీక్‌, అరిష్‌, హబిబుర్‌ రెహ్మాన్‌, మహ్మద్‌ ఫయాజ్‌, ఇస్మాయిల్‌ షా, ఫజల్‌, హజ్రత్‌ అలీ, మహ్మద్‌ అసీం, హబీబుల్లాలుగా గుర్తించారు. మరో 5గురు ఉగ్రవాదులకు వివిధ శిక్షలను విధించారు. ఇషాక్‌, అసీంలు సబ్రీని హతమార్చిన కేసులో అభియోగాలు ఎదుర్కొంటుండగా, వీరి దాడుల్లో 17 మంది అధికారులు మరణించారని సైనిక వర్గాలు వెల్లడించాయి. మత ప్రబోధకుడు సబ్రీ (45) 2016 జూన్‌ 22న కరాచీలో కారులో ప్రయాణిస్తుండగా ఉగ్రవాదులు నేరుగా అతని తలపై కాల్పులు జరిపి హతమార్చారు. సబ్రీపై దాడికి తామే బాధ్యులమంటూ తెహ్రాకీ తాలిబాన్‌ హకీముల్లా మసూద్‌ గ్రూప్‌ ప్రకటించింది.