24 గంటల సుదీర్ఘ రెస్క్యూ ఆపరేషన్ నిరాశే మిగిల్చింది!

వాస్తవం ప్రతినిధి: పసికందును కోతి ఎత్తుకెళ్లిన ఘటన విషాదంతమైంది. 24 గంటల సుదీర్ఘ రెస్క్యూ ఆపరేషన్ నిరాశే మిగిల్చింది. స్థానిక బావిలో ఆ చిన్నారి మృతదేహం కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఒడిషాలోని బంకిసమితి తాలూకా తాలబస్తా గ్రామానికి చెందిన రామకృష్ణ నాయక్‌ దంపతులకు 16 రోజుల కిందట పండంటి మగబిడ్డ జన్మించాడు. శనివారం (మార్చి 31) ఉదయం 5 గంటల సమయంలో తండ్రి చెంతన హాయిగా నిద్రిస్తున్న ఆ పసికందును వానరం ఎత్తుకెళ్లింది. దోమతెరను చింపి కోతి పసికందును ఎత్తుకెళ్తుండటాన్ని చూసిన నాయక్ భార్య పెద్దగా అరిచింది. వెంటనే తేరుకున్న అతడు దాన్ని అడ్డుకోవడానికి విపలయత్నం చేశాడు. చూస్తుండగానే అది పసికందుతో మాయమైంది. దీంతో ఆ ఇల్లాలు సొమ్మసిల్లి పడిపోయింది. స్థానికులు, బంధువుల సాయంతో నాయక్.. ఆ ప్రాంతమంతా గాలించాడు. సమాచారం అందుకున్న అటవీ అధికారులు, పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు.  ఆదివారం ఉదయం నాయక్ ఇంటి సమీపంలోని ఓ బావిలో ఆ పిల్లాడి మృతదేహం కనిపించింది. వానరం పిల్లాడిని ఎత్తుకెళ్తున్న సమయంలో బావిలో జారిపడి ఉంటాడని అధికారులు భావిస్తున్నారు. చిన్నారి మరణవార్త తెలియగానే ఆ దంపతులు కుప్పకూలిపోయారు. ఆ తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరితరం కావడంలేదు .