స్మిత్ స్థానంలో సౌతాఫ్రికా వికెట్ కీపర్ కు స్థానం!

వాస్తవం ప్రతినిధి: ఇటీవల బాల్‌ టాంపరింగ్ వివాదంతో ఒక ఏడాది పాటు నిషేదానికి గురైన ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఐపీ ఎల్ కు కూడా దూరమైన సంగతి తెలిసిందే. అయితే స్మిత్ స్థానంలో మరో ఆటగాడిని నియమించుకుంది రాజస్థాన్ రాయల్స్.  స్మిత్ స్థానంలో సౌతాఫ్రికా వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ హెన్రిచ్ క్లాసెన్‌ను రాజస్థాన్ ఎంపిక చేసుకుందని బీసీసీఐ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. మూడు నెలల క్రితం సొంతగడ్డ(దక్షిణాఫ్రికా)పై భారత్‌తో సిరీస్‌లో క్లాసెన్ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. నాలుగు వన్డేలు, మూడు టీ20ల్లో భారత స్పిన్నర్లపై విరుచుకుపడి అతడు గొప్పగా రాణించాడు. స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కోగల సత్తా అతనిలో ఉంది. ఈ కారణంతో మిగతావాళ్లను కాదని క్లాసెన్‌ను తీసుకోవడానికి మొగ్గుచూపామని రాజస్థాన్ క్రికెట్ హెడ్ జుబిన్ భరుచా తెలిపారు. ఐపీఎల్-2018 సీజన్‌కు ఆజింక్య రహానెను కెప్టెన్‌గా రాయల్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.