పలు చోట్ల హింసాత్మకంగా మారిన భారత్ బంద్

వాస్తవం ప్రతినిధి:  ఎస్సీ, ఎస్టీ చట్టంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా దళిత వర్గాలు ఇచ్చిన భారత్‌ బంద్‌ పిలుపు దేశవ్యాప్తంగా పలు చోట్ల హింసాత్మకంగా మారింది. పలు ప్రాంతాల్లో ఆందోళనకారులు రైళ్లను, బస్సులను అడ్డుకోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక భారత్‌బంద్‌ కారణంగా ఉత్తరప్రదేశ్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. మీరట్‌ జిల్లాలోని శోభాపూర్‌ పోలీసు ఔట్‌పోస్టుకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. పలు వాహనాలను ధ్వంసం చేశారు. పదుల సంఖ్యలో బస్సులకు నిప్పుపెట్టారు. ఆగ్రాలో పోలీసులు, మీడియా సిబ్బందిపై రాళ్ల దాడికి దిగిన నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. రాళ్ల దాడిలో పలువురు పోలీసులకు, మీడియా సిబ్బందికి గాయాలయ్యాయి. ఆందోళనకారులు ఓ పెట్రోల్‌ స్టేషన్‌కు నిప్పుపెట్టడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. మరోపక్క మధ్యప్రదేశ్‌లో  కూడా బంద్ హింసాత్మకంగా మారినట్లు తెలుస్తుంది. ఆ హింస వల్ల మురెనాలో ఒకరు మృతిచెందడం తో అక్కడ కర్ఫ్యూ విధించారు. ఆందోళనకారులు రైల్వే ట్రాక్‌ను బ్లాక్ చేశారు. అక్కడ కూడా కర్ఫ్యూ విధించారు. సెక్షన్ 144ను కూడా విధిస్తూ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. నగరంలోని ఓ ప్రాంతంలో ఓ వ్యక్తి పిస్తోల్‌తో ఫైరింగ్ జరిపాడు. దానికి సంబంధించిన వీడియో రిలీజైంది. బింద్ పట్టణంలోనూ ఆందోళనకారులు రాళ్లు రువ్వినట్లు తెలుస్తుంది.