ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పై సుప్రీం తీర్పును పునఃసమీక్షించండి అంటూ లేఖ రాసిన జగన్

వాస్తవం ప్రతినిధి:  ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టానికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పును పునఃసమీక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీలకు వైఎస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లేఖలు రాసినట్లు తెలుస్తుంది. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉందని జగన్ అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఎస్సీ, ఎస్టీలు అభద్రతా భావానికి లోనవుతారని లేఖ లో తెలిపారు. అలానే ఏపీ సి ఎం చంద్రబాబు దళితుడి గా పుట్టాలని ఎవరూ కోరుకోరంటూ వ్యాఖ్యలు చేసిన సంగతి, అలానే ఏపీ మంత్రి ఆది నారాయణ రెడ్డి దళితులు అపరిశుభ్రంగా ఉంటారని పేర్కొన్నారని లేఖ ద్వారా గుర్తు చేసినట్లు తెలుస్తుంది. దళితులను కించపరిచే వ్యాఖ్యలు ఏపీలో ప్రస్తుత పాలకుల ఫ్యూడల్ భావజాలానికి నిదర్శనమని, పాలకులే అలా మాట్లాడితే మిగిలిన వారి సంగతి ఏంటో మీరే ఆలోచించాలి. భారత రాజ్యాంగం కుల రహిత సమాజాన్ని కోరుకుందని రాష్ట్రపతి కోవింద్‌, ప్రధాని మోదీలకు రాసిన లేఖల్లో వైఎస్ జగన్ పేర్కొన్నట్లు తెలుస్తుంది.