ఆత్మహత్య చేసుకున్న యాంకర్

వాస్తవం సినిమా: V6 ఛానల్ లో న్యూస్ యాంకర్‌గా పనిచేస్తున్న ప్రముఖ యాంకర్ రాధిక (30) ఆదివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కార్యాలయం నుంచి వచ్చిన కొద్ది సేపటికే ఆమె ఈ అఘాయిత్యం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలప్రకారం..

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మానేపల్లి గ్రామానికి చెందిన 36 ఏళ్ల రాధిక V6 ఛానల్ లో యాంకర్ గా పని చేస్తోంది. 15 ఏళ్ల క్రితం ఆమెకు వివాహమైంది. కొంతకాలంగా భర్తతో దూరంగా ఉందని.. ఆర్నెల్ల క్రితమే వారికి విడాకులు మంజూరు అయినట్లుగా చెబుతున్నారు. మూసాపేటలోని ఒక అపార్ట్ మెంట్లో మానసికంగా ఎదగని కుమారుడు భానుతేజారెడ్డి (14)తో కలిసి సిస్టర్ ఇంట్లో ఉంటోంది. ఎప్పటిలాగే ఆదివారం ఉదయం ఆఫీసుకు వెళ్లిన ఆమె రాత్రి 10 గంటలకు ఇంటికి బయలుదేరారు. ఇంటికి వచ్చిన వెంటనే.. బ్యాగ్ ఇంట్లో పడేసి.. అపార్ట్ మెంట్ ఐదో అంతస్తుకు చేరుకున్నారు. అక్కడ నుంచి దూకి ఆత్మహత్యా యత్నం చేశారు. పై నుంచి ఏదో పడిన శబ్ధం పెద్దగా వినిపించటంతో అపార్ట్ మెంట్ వాసులు చూశారు. సూసైడ్ చేసుకున్న వైనాన్ని పోలీసులకు తెలియజేశారు. ఎత్తు నుంచి కిందకు దూకేయటం.. తలకు తీవ్ర గాయం కావటంతో రాధిక అక్కడికక్కడే మరణించారు.
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆమె బ్యాగ్ ను స్వాధీనం చేసుకున్నారు. బ్యాగ్ లో ఆమె సూసైడ్ నోట్ దొరికింది. తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని పెన్సిల్ తో పేర్కొంది. మానసిక ఒత్తిడి.. డిప్రెషన్ తోనే తాను చనిపోతున్నట్లుగా రాసింది. తన మరణానికి ఎవరూ కారణం కాదన్న రాధిక.. “నా బ్రెయిన్ నా శత్రువు” అని పేర్కొనటం గమనార్హం. భర్తతో దూరంగా ఉండటం.. మానసికంగా ఎదగని కొడుకు లాంటి కారణాలతో ఆమె తీవ్ర వేదనకు గురైనట్లుగా చెబుతున్నారు. సూసైడ్ నోట్ తో ప్రాధమిక విచారణ చేపట్టినప్పటికీ.. ఆమె ఆత్మహత్య చేసుకోవటానికి కారణాలు ఏమిటన్న విషయంపై పోలీసులు విచారణ చేపట్టారు.