భక్త జనసంద్రమైన తిరుమల

వాస్తవం ప్రతినిధి: ఇంటర్‌, పదో తరగతి పరీక్షలు ముగియడంతో శ్రీవారి దర్శనార్థం వేలాదిగా యాత్రికులు తిరుమల తరలివచ్చారు. ఈ నేపథ్యంలో తిరుమల గిరులు ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంతగా కిటకిటలాడుతున్నాయి. ఈ ఉదయం సర్వ దర్శనం నిమిత్తం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ ను దాటి 2 కిలోమీటర్ల పొడవున యాత్రికులు బారులుతీరారు. క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లూ నిండగా, ఇప్పుడు క్యూలైన్ లోకి ప్రవేశించిన వారికి ధర్మదర్శనానికి 15-18 గంటలకుపైగా సమయం తీసుకుంటోంది. కాలినడకన వచ్చే యాత్రికులకు రోజుకు 20 వేల మందికి మాత్రమే దివ్యదర్శనం టోకెన్లను తితిదే జారీ చేస్తుంది. ఇవి అర్ధరాత్రి 12 గంటలకు ప్రారంభించగా.. తెల్లవారుజాము వరకే అయిపోయాయి. తర్వాత వచ్చిన కాలినడక భక్తులంతా సర్వదర్శనం వరుసల్లోనే వెళ్లారు. గదుల కొరత అధికంగా ఉండటంతో, భక్తులు ఆరు బయటే విశ్రమించాల్సిన పరిస్థితి. దీనికితోడు నిన్న సాయంత్రం తిరుమలలో ఉరుములు, మెరుపులతో వర్షం కురియగా, భక్తులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ రద్దీ మరో నాలుగైదు రోజుల పాటు కొనసాగనుందని అంచనా వేస్తున్నామని, భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ అధికారులు వెల్లడించారు. కాగా, తిరుమల శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు శనివారంతో ముగిశాయి. ముగింపు వేడుకల్లో భాగంగా, మలయప్పస్వామి, శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణ విగ్రహాలకు స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.