ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి హోదా వచ్చే అవకాశమే లేదు: జయప్రకాశ్ నారాయణ

వాస్తవం సినిమా: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాను తొలుత తెరపైకి తెచ్చింది తానేనని, ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి హోదా వచ్చే అవకాశమే లేదని, ఈ విషయం అన్ని రాజకీయ పార్టీలకు తెలుసని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. పేరు ఏదైనా కావచ్చు కానీ, రాష్ట్రానికి రావాల్సిన నిధులన్నీ రావాలని ఆకాంక్షించారు.ఇదే విషయాన్ని ఎపి బిజెపి నేతలు ఎప్పట్నుంచో చెబుతున్నప్పటికీ లోక్ సత్తా అధినేత జెపి నోటి వెంట ఈ వ్యాఖ్యలు రావడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. జయప్రకాశ్ నారాయణ ఆధ్వర్యంలో స్వతంత్ర నిపుణుల బృందం ఏర్పాటై శుక్రవారం రోజు తొలి సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశం ముగిసిన అనంతరం జేపీ మీడియాతో మాట్లాడారు..ఎపి రాజకీయ పార్టీలు ఓట్ల రాజకీయాలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు. ఎపికి ప్రత్యేక హోదా బదులుగా దానికి సమానంగా ఎంత లబ్ది చేకూరుతుందో అంచనా వేసి ఆ మొత్తం కేంద్రం సాయం చేయాలని ఆయన సూచించారు.ఇక తన ఆధ్వర్యంలో పనిచేస్తున్న స్వతంత్ర నిపుణుల బృందంతో సమావేశంలో జెపి…రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కు చట్టపరంగానూ, పార్లమెంట్ లోనూ ఇచ్చిన హామీల్ని భారత ప్రభుత్వం ఏమేరకు నెరవేర్చిందీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వారధిగా పనిచేస్తూ వివాద పరిష్కారానికి తోడ్పాటునందించే పౌరసమాజంగా వ్యవహరించడం, ఇతరత్రా అంశాలను చర్చించారు.

ఈ కమిటీలో మాజీ ఐఏఎస్ పద్మనాభయ్య, ప్రొఫెసర్ గలాబ్, రాఘవా చారీ, శాంతాసిన్హా, హెచ్ఏ దొర తదితర ప్రముఖులు ఉండటం గమనార్హం.