ప్రచ్చన్న యుద్ధం నాటి పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదం ఉంది: ఐరాస ప్రధాన కార్యదర్శి

వాస్తవం ప్రతినిధి: రష్యా దౌత్యవేత్తలను అమెరికా సహా పశ్చిమ దేశాలు బహిష్కరించిన నేపథ్యంలో అమెరికా, రష్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నాటి పరిస్థితులు, ఉద్రిక్తతలు తలెత్తే ప్రమాదముందని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటానియో గుటెరస్‌ హెచ్చరించారు. ప్రచ్ఛన్న యుద్ధంలో మనం జీవించిన నాటి పరిస్థితులు మళ్లీ ఇప్పుడు తలెత్తుతున్నట్లు తాను భావిస్తున్నానని న్యూయార్క్‌లో ఐరాస ప్రధాన కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడుతూ గుటేరస్ అన్నారు.  రష్యా మాజీ గూఢచారిపై విషప్రయోగం ఆరోపణల నేపథ్యంలో 150మంది రష్యా దౌత్యవేత్తలను బహిష్కరించినట్లు అమెరికా, యూరప్‌, నాటో దేశాలు ప్రకటించిన తెలిసిందే. అయితే దానికి ప్రతిగా రష్యా కూడా 60మంది అమెరికా దౌత్యవేత్తలను బహిష్కరించడమే కాకుండా అమెరికా కాన్సులేట్‌ కార్యాలయాన్ని కూడా మూసివేయవలసిందిగా ఆదేశాలు జారీ చేసింది. అయితే  ఈ పరిణామాల పట్ల ఐరాస ప్రధాన కార్యదర్శి గుటేరస్ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను నివారించుకునే యంత్రాంగాలు కొరవడడంపై చాలా ఆందోళన చెందుతున్నట్లు గుటెరస్‌ తెలిపారు. ముందు జాగ్రత్తలు తీసుకునే సమయం ఇదని తాను విశ్వసిస్తున్నట్లు ఆయన చెప్పారు.