తొలిసారి మీడియా సమావేశంలో మాట్లాడుతూ కన్నీటి పర్యంతం అయిన వార్నర్

వాస్తవం ప్రతినిధి: బాల్‌ టాంపరింగ్‌ వివాదంలోఆసీస్ క్రికెటర్ వార్నర్ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే ఈ వివాదం వచ్చిన తరువాత మొదటి సారి వార్నర్ మీడియా సమావేశంలో మాట్లాడాడు. మీడియా సమావేశంలో మాట్లాడిన వార్నర్ కన్నీటి పర్యంతమయ్యాడు. జీవితంలో తానెప్పటికీ ఆస్ట్రేలియా తరఫున క్రికెట్‌ ఆడలేమోనని వార్నర్‌ బాధపడ్డాడు. క్రికెట్‌ ఆస్ట్రేలియా వార్నర్‌పై ఏడాది నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా నుంచి తిరిగి స్వదేశానికి చేరుకున్న వార్నర్‌ తొలిసారి మీడియాతో మాట్లాడాడు.

క్రికెట్‌ అభిమానులను, నేను క్రికెటర్‌గా స్థిరపడేందుకు ప్రోత్సహించిన వారందరినీ ఈ సందర్భంగా క్షమాపణలు కోరుతున్నాను. నా తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాను. నాపై మీ గౌరవాన్ని తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తాను. కేప్‌టౌన్‌ టెస్టులో మూడో రోజు చోటు చేసుకున్న పరిణామాలకు నేను పూర్తి బాధ్యత వహిస్తున్నాను. జట్టులోని మిగతా ఆటగాళ్లకు, సిబ్బంది, దక్షిణాఫ్రికా అభిమాలను కూడా క్షమాపణలు కోరుతున్నాను. నేను చేసిన తప్పుకు క్రికెట్‌ ఆస్ట్రేలియా ఇచ్చిన తీర్పునకు కట్టుబడి ఉన్నాను. నాకు మాత్రం నేను తిరిగి ఆస్ట్రేలియా తరఫున ఆడతానన్న నమ్మకం లేదు అని వార్నర్‌ కన్నీటి పర్యంతమయ్యాడు.  అలానే ఈ తప్పిదం కారణంగా నా భార్య కాండీస్‌, పిల్లల్ని కూడా నన్ను క్షమించమని కోరుతున్నాను. మీరు లేకపోతే నేను లేను. ఇలాంటి పనులు నేను భవిష్యత్తులో మళ్లీ చేయను అని ప్రామిస్‌ చేస్తున్నాను అని వార్నర్ తెలిపాడు.