చందా కొచ్చర్‌ భర్తపై సిబిఐ ప్రాథమిక దర్యాప్తు

వాస్తవం ప్రతినిధి: సీఐసీఐ బ్యాంకు సీఈవో చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్, వీడియోకాన్ గ్రూపు చైర్మన్ వేణుగోపాల్ ధూత్ మధ్య అనుబంధంపై అవినీతి ఆరోపణలు రావడంతో సీబీఐ ప్రాథమిక విచారణను ప్రారంభించిందని విశ్వసనీయ సమాచారం. వీడియోకాన్‌కు సుమారు రూ.3,250 కోట్ల రుణాలను మంజూరు చేయడంతో వీడియోకాన్‌ ప్రమోటర్‌ వేణుగోపాల్‌ దూత్‌, చందా కొచ్చర్‌, ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌పై ఆరోపణలు వెలువడ్డాయి. వీటిలో రూ.2,810 కోట్లను చెల్లించలేదు. 2017లో ఎన్‌పిఎ (నాన్‌ ఫెర్మామింగ్‌ ఎస్సెట్స్‌)గా సంస్థ ప్రకటించింది. అయితే, వీడియోకాన్ గ్రూపు చమురు వ్యాపారం కోసం రూ.40,000 కోట్ల రుణాలు ఇచ్చేందుకు 20 బ్యాంకుల కన్సార్షియం ఆమోదం తెలుపగా, అందులో తమ వాటా రూ.3,250 కోట్లు అని, ఇందులో చందాకొచ్చర్ లాలూచీ ఏదీ లేదని ఐసీఐసీఐ బ్యాంకు ఇప్పటికే స్పష్టం చేసింది. మరోవైపు సెబీ కూడా కార్పొరేట్ గవర్నెన్స్ పరంగా ఏవైనా ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయా అని విచారణ మొదలు పెట్టినట్లు సమాచారం.