గురుకుల పాఠశాల లో విషాదం….కల్తీ నీరు తాగి 60 మంది అస్వస్థత

వాస్తవం ప్రతినిధి: యాదాద్రి – భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాల లో విషాదం చోటుచేసుకుంది. మోటకొండూరు మండల కేంద్రంలోని బీసీ గురుకుల పాఠశాలలో కలుషిత నీరు తాగి 60 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అయితే వీరిలో 13 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనపై వైద్యుడు సాంబశివరావు తెలిపిన కథనం ప్రకారం.. బీసీ గురుకుల పాఠశాల విద్యార్థులు శుక్రవారం రాత్రి కలుషిత నీటిని తాగారు. దీంతో శనివారం ఉదయం 60 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే బీఎన్‌హెచ్‌వో సాంబశివరావుకు పాఠశాల నిర్వాహకులు సమాచారం అందించారు. సాంబశివరావు విద్యార్థులకు పాఠశాలలోనే చికిత్స అందించారు. వీరిలో 13 మంది విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై విచారణ జరిపి కలెక్టర్‌కు నివేదిక అందజేస్తామని  యాదాద్రి డీఆర్‌వో రావుల మహేందర్‌రెడ్డి తెలిపారు.