ఒంటిమిట్ట సీతారామచంద్రస్వామి కల్యాణోత్సవంలో ప్రకృతి బీభత్సం కారణంగా అపశ్రుతి.. నలుగురు మృతి

వాస్తవం ప్రతినిధి:ఒంటిమిట్ట సీతారామచంద్రస్వామి కల్యాణోత్సవంలో ప్రకృతి బీభత్సం కారణంగా అపశ్రుతి చోటుచేసుకుంది. అకాల వర్షం, పెను గాలుల బీభత్సానికి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో వందమందికిపైగా గాయపడ్డారు. అన్ని దేవాలయాల్లా కాకుండా ఈ ఆలయ సంప్రదాయం ప్రకారం శ్రీరామ నవమి తర్వాత పున్నమి రాత్రి వేళ ఇక్కడ కల్యాణం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా శుక్రవారం కల్యాణం నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తుల కోసం ప్రత్యేకంగా మూడు గ్యాలరీలను నిర్మించారు. భారీ ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటు చేశారు. మరి కొన్ని గంటల్లో జానకిరాముల పెళ్లి ప్రారంభం కానున్న తరుణంలో అమాయకులపై మృత్యు పంజా విసిరింది. సుడిగాలి విజృంభించి రామయ్య వివాహా మహోత్సవంలో కల్లోలం సృష్టించింది. ఎవరూ ఊహించని పరిణామం చోటుచేసుకుంది. వాయుదేవుడు ఉగ్రరూపం దాల్చడంతో అక్కడంతా చిగరుటాకులా వణికిపోయారు. విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో చీకట్లు కమ్ముకున్నాయి. గంటకుపైగా భారీ వర్షం కురిసింది. పెనుగాలులకు గ్యాలరీ కూలి దాని రేకులు, ఇనుప కమ్మీలు భక్తులపై పడడంతో ముగ్గురు భక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు ప్రాణాలు విడిచారు. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మరో వందమందికిపైగా భక్తులు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఏడుగురు పోలీసులు ఉన్నారు.

ఒంటిమిట్ట దుర్ఝటనపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రులు, కడప జిల్లా అధికారులతో ఈ ఉదయం సమీక్షా సమావేశం నిర్వహించారు. ముందస్తు జాగ్రత్తలు చేపట్టడంలో విఫలమయ్యారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంటిమిట్టలో శాశ్వత మండపం ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని పేర్కొన్నారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు రూ.15 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.3 లక్షలు, గాయపడిన వారికి లక్ష రూపాయల పరిహారం ఇవ్వనున్నట్టు ప్రకటించారు.అనంతరం జిల్లా మంత్రులు, తెదేపా నేతలతో పార్టీ సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లాలో పార్టీ బలోపేతంపై నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.