ఇంటి ఆవరణలోకుప్పలు కుప్పలుగా పాము పిల్లలు

వాస్తవం ప్రతినిధి: వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌ మండలం జలాల్‌పూర్‌లో ఉషణప్ప ఇంటివద్ద ఆరుబయట ఓ బండరాయిని తొలగించగా.. ఒకదానివెంట ఒకటిగా పాముపిల్లలు బయటకొచ్చాయి. ఒకదాని తరువాత ఒకటిగా వస్తున్న పాము పిల్లలను చూసి బండరాతిని తొలగించిన గ్రామస్తులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. వివరాలప్రకారం..
వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌ మండలం జలాల్‌ పూర్‌ గ్రామానికి చెందిన చాకలి హుసేనప్పకు దెబ్బ తగలింది. దీంతో ఆ దెబ్బకు కట్టుకట్టేందుకు కొన్ని ఆకులు తెచ్చిన అతని సోదరుడు మొగులప్ప ఇంటి ఆవరణలో ఉన్న రాతిపై నూరడం మొదలు పెట్టాడు.ఇంతలో ఆ బండ సందులోంచి రెండు పాము పిల్లలు బయటకు వచ్చాయి. దీంతో వాటిని చుట్టుపక్కల వారి సాయంతో చంపి, ఆ బండను తొలగించగా అక్కడి నుంచి కుప్పలు కుప్పలుగా పాము పిల్లలు బయటకొచ్చాయి. దీంతో సుమారు 300 పాము పిల్లలను చంపి తగులబెట్టారు. తెల్లవారిన తరువాత మరోనాలుగు పాము పిల్లలు బయటకు రావడంతో ఆ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. మిగిలిన బండరాళ్లనూ పెకిలించి చూడగా వందల సంఖ్యలో పాము పిల్లలు, గుడ్లు బయటపడ్డాయి. వాటిని చంపేసి కాల్చివేశారు.