ఆల్ టైమ్ టెస్ట్ క్రికెట్ జట్టును ప్రకటించిన యూనిస్ ఖాన్

వాస్తవం ప్రతినిధి: పాకిస్థాన్‌ క్రికెట్‌ దిగ్గజం యూనిస్‌ ఖాన్‌ తన ఆల్‌ టైమ్‌ టెస్టు క్రికెట్‌ జట్టును ప్రకటించాడు. లార్డ్స్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ సోషల్‌ మీడియా ద్వారా యూనిస్‌ ఖాన్‌ ప్రకటించిన ఈ జట్టులో భారత తరఫున ఒక్క సచిన్‌ తెందూల్కర్‌ మాత్రమే చోటు దక్కించుకోవడం విశేషం. అలానే అతడు ప్రకటించిన క్రికెట్ జట్టు సారథిగా పాకిస్థాన్‌ దిగ్గజం ఇమ్రాన్‌ ఖాన్‌ పేరును సూచించాడు. ఓపెనర్లుగా హనీఫ్‌ మహమ్మద్‌, సచిన్‌ తెందూల్కర్‌ పేర్లను పేర్కొన్నాడు. ఇక వన్‌డౌన్‌ బ్యాట్స్‌మెన్‌గా ఆల్‌రౌండర్‌ కలీస్‌, తర్వాతి స్థానాల్లో బ్రియన్‌ లారా, సర్‌ వివ్‌ రిచర్డ్స్‌, గ్యారీ సోబర్స్‌ ఉంటారని తెలిపాడు. వికెట్‌ కీపర్‌గా ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌కు కూడా తన కలల జట్టులో చోటిచ్చాడు. బౌలర్లుగా సర్‌ రిచర్డ్‌ హడ్లే, గ్లేన్‌ మెక్‌గ్రాత్‌ముత్తయ్య మురళీధరన్‌ పేర్లను పేర్కొన్నాడు. తన ఆల్‌ టైమ్‌ టెస్టు జట్టుగా ఇదే అత్యంత బలమైన జట్టు అని యూనిస్‌ ఖాన్‌ చెప్పుకొచ్చాడు.