అవన్నీ మీడియా సృష్టించిన కథనాలు: సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ

వాస్తవం ప్రతినిధి: సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన రాజకీయాలలో చేరబోతున్నట్లు మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. ఈ కథనాలపై తాజాగా ఆయన స్పందించారు. జనసేనలో చేరుతున్నట్టు తనపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలే అని ఆయన చెప్పారు. ఇవన్నీ మీడియా సృష్టించిన కథనాలని ఆయన కొట్టిపారేశారు.

స్వచ్ఛంద పదవీ విరమణ కోసం దరఖాస్తు చేసుకున్న విషయం వాస్తవమేనని చెప్పారు. అయితే, తన దరఖాస్తును మహారాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిందని ఆయన తెలిపారు. తన రాజీనామాను ప్రభుత్వం ఆమోదించిన తర్వాత… భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని చెప్పారు. మరోవైపు లక్ష్మినారాయణ గురించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల మాట్లాడుతూ, ఆయన వస్తే జనసేనలోకి ఆహ్వానిస్తామని చెప్పిన సంగతి తెలిసిందే.