2019 లో తాను చెప్పిన వ్యక్తే ప్రధాని అవుతారన్న చంద్రబాబు

వాస్తవం ప్రతినిధి: 2019 లో తాము నిర్ణయించిన వ్యక్తే దేశ ప్రధాని అవుతారని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు జోస్యం చెప్పారు. గుంటూరు టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం పార్టీ 37వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించబోతున్నామని, తాను చెప్పిన వ్యక్తే ప్రధాని అవుతారని అన్నారు. విభజన తర్వాత రాష్ట్రం ఎంతగానో నష్టపోయిందని, రాష్ట్రం బాగుపడుతుందనే ఉద్దేశంతోనే నాడు బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ యేతర పార్టీలన్నింటినీ ఒక తాటిపైకి తెచ్చిన ఘనత ఎన్ టీఆర్ కు దక్కిందన్నారు. దేశంలో 1984లో లోక్ సభలో టీడీపీ ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించిందని చంద్రబాబు అన్నారు.

ప్రత్యేక హోదా – ప్రత్యేక ప్యాకేజీపై కేంద్రం మోసం చేసిందని చంద్రబాబు మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై బీజేపీ నాయకులు అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. హోదాపై మోడీ ఇచ్చిన హామీని ఇప్పటికైనా నిలబెట్టుకోవాలన్నారు. బీజేపీ పలు రాష్ట్రాల్లో అధికారం కోసం ఎన్నో రాజకీయాలు చేసిందని కానీ ఈ రాష్ట్రంలో దాని ఆటలు సాగనివ్వబోమన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాట్లాడుతూ నిప్పులాంటి చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు చేయడం తగదన్నారు. బడ్జెట్ లో న్యాయం చేయమంటే అవినీతి ఆరోపణలు చేస్తారా ?అని ప్రశ్నించారు.