సిద్దు బ్యాంకు అకౌంట్లను సీజ్ చేసిన ఐటీ అధికారులు

వాస్తవం ప్రతినిధి: మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవ్‌జ్యోత్ సింగ్ సిద్దుకు చెందిన రెండు బ్యాంక్ అకౌంట్లను ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ సీజ్ చేసినట్లు తెలుస్తుంది. పన్నులు కట్టలేదన్న కారణంగానే ఐటీ శాఖ అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సిద్దు అన్నీ కలిపి ఇప్పటివరకు రూ.52 లక్షల పన్ను కట్టాల్సి ఉందని, అలానే వివిధ ఖర్చులకు సంబంధించి గడువులోపు బిల్స్ లేదా ఇన్‌వాయిస్‌లను చూపడంలో కూడా సిద్దు విఫలమయ్యారని ఐటీ అధికారులు చెప్పారు.  దీనితో ఆయన ఖర్చు 30 శాతాన్ని అనగా 52 లక్షలను పన్నుగా వసూలు చేయాలని నిర్ణయించారు. అయితే మరోపక్క పన్ను కట్టాల్సిందిగా ఐటీ శాఖ పంపిన నోటీసులను సవాలు చేస్తూ సిద్దు అప్పీల్ చేయగా, కమిషనర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్ (అప్పీల్స్) ఆ ఖర్చులకు సంబంధించిన తగిన ఆధారాలను చూపలేదంటూ సిద్దూ అప్పీల్‌ను తిరస్కరించినట్లు తెలుస్తుంది. ఆ తర్వాత కూడా సిద్దు పన్ను కట్టకపోవడంతో ఆయనకు సంబంధించిన రెండు బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేసినట్లు తెలుస్తుంది.