శనివారం మీడియా తో మాట్లాడనున్న వార్నర్: క్రికెట్ ఆస్ట్రేలియా

వాస్తవం ప్రతినిధి:  బాల్‌ టాంపరింగ్‌ వివాదం తో ఆసీస్ క్రికెటర్ల పై వేటు పడిన సంగతి తెలిసిందే. ఈ టాంపరింగ్ వివాదంలో కీలక పాత్ర పోషించిన డేవిడ్‌ వార్నర్‌ కూడా శనివారం మీడియా ముందుకు రానున్నాడు. బాల్ టాంపరింగ్ కారణంగా నిషేధానికి గురైన స్మిత్‌, వార్నర్‌, బాన్‌క్రాఫ్ట్‌ గురువారం దక్షిణాఫ్రికా నుంచి తిరిగి స్వదేశానికి చేరుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్మిత్‌ మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యాడు. అలాగే బాన్‌క్రాఫ్ట్‌ కూడా మీడియాతో మాట్లాడి క్షమించాల్సిందిగా కోరాడు. అయితే తాజాగా క్రికెట్‌ ఆస్ట్రేలియా అధికారులుశనివారం సిడ్నీ లో వార్నర్ మీడియా సమావేశంలో మాట్లాడుతాడని ఒక ప్రకటన ద్వారా విడుదల చేశారు. ఇద్దరు కూతుళ్లతో కలిసి విమానాశ్రయానికి వచ్చిన వార్నర్ భార్య కాండీస్‌ భర్త భుజంపై తల వాల్చి బోరున ఏడ్చేసిన దృశ్యం అభిమానుల్ని కలచివేసింది. అయితే భారత క్రికెటర్లు సచిన్‌, రోహిత్‌ శర్మ తదితరులు స్మిత్‌, వార్నర్‌కు మద్దతుగా నిలిచారు. గడ్డు కాలంలో వారికి, వారి కుటుంబసభ్యులకు మద్దుతుగా ఉండాలని ట్విటర్‌ ద్వారా కోరారు. క్రికెట్‌ ఆస్ట్రేలియా విధించిన ఏడాది నిషేధం కారణంగా స్మిత్‌, వార్నర్ ఐపీఎల్‌కు దూరమైన సంగతి తెలిసిందే.