వరుస పరాజయాల సమయంలో పలకరించిన విజయం!

వాస్తవం ప్రతినిధి: వరుస పరాజయాలను ఎదుర్కొంటున్న భారత మహిళల క్రికెట్‌ జట్టుకు ఎట్టకేలకు ఊరట లభించింది. ముక్కోణపు టీ20 సిరీస్‌లో భాగంగా గురువారం ఇంగ్లాండ్‌తో నామమాత్రమైన మ్యాచ్‌లో భారత్‌ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. అద్భుత ఫామ్‌లో ఉన్న స్మృతి మంధాన (62 నాటౌట్‌; 41 బంతుల్లో 8×4 1×6) మరో అర్ధశతకంతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌..  18.5 ఓవర్లలో 107 పరుగులకే ఆలౌటైంది. అనుజ పాటిల్‌ (3/21), రాధాయాదవ్‌ (2/16), పూనమ్‌యాదవ్‌ (2/17), దీప్తి శర్మ (2/24) ఇంగ్లాండ్‌ పతనాన్ని శాసించారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్‌ త్వరగానే రెండు వికెట్లు కోల్పోయింది. అయితే 13 పరుగుల వద్ద లభించిన ఒక్క అవకాసాన్ని సద్వినియోగం చేసుకున్న మంధాన తర్వాత రెచ్చిపోయి ఆడింది. కెప్టెన్‌ హర్మన్‌ (20నాటౌట్‌)తో కలిసి జట్టుకు విజయాన్ని అందించింది. ఈ టోర్నీలో తొలి మూడు మ్యాచ్‌ల్లో ఓడిన భారత్‌ ముందే ఫైనల్‌ రేసుకు దూరమైంది. శనివారం ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియాల మధ్య ఫైనల్‌ జరగనుంది.