నేడు ఒంటిమిట్ట కోదండరామస్వామి కళ్యాణం

వాస్తవం ప్రతినిధి: ఒంటిమిట్టలోని కోదండరామస్వామి కళ్యాణ మహోత్సవం నేడు జరగనున్నది.ఈ మహోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొననున్నారు. అదేవిధంగా ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. భక్తులు కూడా పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. ఇప్పటికే ఆలయ సిబ్బంది ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు.

శ్రీ సీతారాముల కల్యాణం ఏర్పాట్లను టిటిడి తిరుపతి జెఈవో శ్రీపోల భాస్కర్‌ గురువారం కడప జిల్లా కలెక్టర్‌ శ్రీటి.బాబురావు నాయుడు, రాష్ట్ర ప్రభుత్వ విప్‌ శ్రీ మేడా మల్లికార్జునరెడ్డి, కడప ఎస్పీ శ్రీఅట్టాడ బాబుజితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జెఈవో మీడియాతో మాట్లాడుతూ ఒంటిమిట్ట రాములవారి బ్రహ్మోత్సవాల్లో శ్రీ సీతారాముల కల్యాణం ఎంతో ముఖ్యమైనదని, దీనిని రాష్ట్రస్థాయి వేడుకగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. గౌ|| రాష్ట్ర ముఖ్యమంత్రి నేడు వస్త్రాలు, తలంబ్రాలు, ముత్యాలు సమర్పించనున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించామని, భద్రతా ఏర్పాట్లకు తగ్గట్టు ఇంజినీరింగ్‌ పనులు చేపడుతున్నామని తెలిపారు. భక్తులందరూ కల్యాణానికి విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.