తప్పులో కాలేస్తున్న బీజేపీ నేతలు…మొన్న అమిత్, నిన్న ప్రహ్లాద్

వాస్తవం ప్రతినిధి: కర్ణాటక లో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ బీజేపీ నేతలు వరుసగా పప్పులో కాలేస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు. మొన్నటికి మొన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. నిన్న బీజేపీ ఎంపీ ప్రహ్లాద్ జోషి.. పప్పులో కాలేశారు. యడ్యూరప్ప పెద్ద అవినీతిపరుడు అని అమిత్ షా వ్యాఖ్యానిస్తే.. దళితులకు మోదీ చేసిందేమీ లేదని ప్రహ్లాద్ జోషి వ్యాఖ్యానించి ప్రత్యర్ధి కాంగ్రెస్ పార్టీ కి ఊతం ఇచ్చినట్లు అయ్యింది. దళితులతో అమిత్ షా సమావేశమైన సందర్భంగా వారిని ఉద్దేశించి అమిత్ షా హిందీలో ప్రసంగించారు. ఈ హిందీ ప్రసంగాన్ని కన్నడ భాషలో బీజేపీ ఎంపీ ప్రహ్లాద్ జోషి ట్రాన్స్‌లేట్ చేస్తూ పొరపాటున మోదీ దళితులకు చేసిందేమీ లేదని వ్యాఖ్యానించాడు.  సిద్ధరామయ్య ప్రభుత్వం కర్ణాటకను అభివృద్ధి చేయలేదు. ప్రధాని నరేంద్ర మోదీ మీద నమ్మకం ఉంచి యడ్యూరప్పకు ఓటేయండి. కర్ణాటకను అభివృద్ధిలో నెంబర్‌వన్ తీర్చిదిద్దుతామని అమిత్ షా హిందీలో చెప్పారు. ఈ వ్యాఖ్యలను కన్నడలో ట్రాన్స్‌లేట్ చేసిన ఎంపీ ప్రహ్లాద్ జోషి నోరు జారి,ప్రధాని నరేంద్ర మోదీ దళితుల అభివృద్ధి కోసం చేసిందేమీ లేదని అన్నారు. అంతే జోషి వ్యాఖ్యలపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ట్విట్టర్‌లో స్పందిస్తూ బీజేపీ నేతలందరూ నిజాలు మాట్లాడుతున్నారంటూ ట్విట్టర్ ద్వారా తెలిపారు.