టాంపరింగ్ అసలు సూత్రధారి వార్నరేనట!

వాస్తవం ప్రతినిధి: ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ పరువు తీసిన బాల్ టాంపరింగ్ వ్యవహారంపై విచారణ జరిపిన క్రికెట్ ఆస్ట్రేలియా మరిన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఈ బాల్ టాంపరింగ్ వ్యవహారం కి పూర్తి భాద్యతే నాదే అని మీడియా సమావేశంలో మాట్లాడిన స్మిత్ కన్నీటి పర్యంతం అయిన సంగతి తెలిసిందే. అయితే క్రికెట్ ఆస్ట్రేలియా మాత్రం ఈ వ్యవహారం మొత్తానికి డేవిడ్ వార్నరే మాస్టర్ మైండ్ అని స్పష్టం చేసింది. స్టీవ్ స్మిత్‌కు ఈ విషయం తెలిసీ అడ్డుకోలేకపోయాడని చెప్పింది. సీఏ చెప్పిన వివరాల ప్రకారం బాల్ టాంపరింగ్ ఎలా చేయాలి, ఎవరు చేయాలి అన్న ప్లాన్ మొత్తం డేవిడ్ వార్నర్‌దే. ఇదే విషయాన్ని అతడు స్మిత్‌తో చెప్పాడు. దానికి అతను కూడా అంగీకరించాడు. ఈ పని కోసం బాన్‌క్రాఫ్ట్‌ను ఎంపిక చేసింది కూడా వార్నరేనట.  సాండ్‌పేపర్‌తో టాంపరింగ్ చేయాలని బాన్‌క్రాఫ్ట్‌కు సూచించడమే కాకుండా ఎలా చేయాలో కూడా డెమో ఇచ్చాడు. దీంతో వార్నర్, స్మిత్‌లపైనే క్రికెట్ ఆస్ట్రేలియా కఠినంగా వ్యవహరించింది. వాళ్లిద్దరిపైనా ఏడాది నిషేధం విధించింది. వాళ్ల ప్లాన్‌ను అమలు చేసిన బాన్‌క్రాఫ్ట్‌పై 9 నెలల నిషేధంతో సరిపెట్టింది. అంతేకాదు ఆస్ట్రేలియా క్రికెట్ పరువు తీసిన ఈ ఘటనకు కారణమైన వార్నర్ భవిష్యత్తులో ఆస్ట్రేలియాకు కెప్టెన్సీ వహించే అవకాశాన్ని కోల్పోయాడు.  అతని పేరెప్పుడూ కెప్టెన్సీకి పరిగణించబోమని సీఏ స్పష్టంచేసింది.