స్వదేశానికి చేరుకున్న మలాలా

వాస్తవం ప్రతినిధి: నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత, సాంఘిక కార్యకర్త మలాలా యూసఫ్‌ జారు గురువారం స్వదేశమైన పాకిస్తాన్‌ చేరుకున్నారు. 2012లో తాలిబన్‌ ఉగ్రవాదులు దాడి జరిగిన తర్వాత మలాలా పాక్‌కు రావడం ఇదే తొలిసారి. . విద్య, మహిళల హక్కుల కోసం పోరాడినందుకు ఆమెను తాలిబన్లు కాల్చారు. మెరుగైన చికిత్స కోసం ఆమెను లండన్‌కు తరలించగా ఆమె ప్రాణాలతో బయటపడ్డారు. అయితే అప్పుడు లండన్ వెళ్ళిన ఆమె ఈ ఉదయం తల్లిదండ్రులతో కలిసి ఇస్లామాబాద్‌లోని బెనజీర్‌ భుట్టో అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు. ఈ నేపధ్యంలో  మలాలాకు స్థానిక పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. కాగా.. భద్రతా కారణాల దృష్ట్యా మలాలా పాకిస్థాన్‌ పర్యటన వివరాలను రహస్యంగా ఉంచుతున్నట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు. నాలుగు రోజుల పాటు ఆమె స్వదేశంలోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ప్రధాని షాహిద్‌ ఖకాన్‌ అబ్బాసీతో మలాలా భేటీ కానున్నట్లు సమాచారం. మానవ హక్కులు, బాలిక విద్య కోసం ఆమె చేసిన పోరాటానికి గానూ 2014లో నోబెల్‌ శాంతి బహుమతి వరించింది.