స్మిత్ ని ఎయిర్ పోర్ట్ లో చీట్..చీట్ అంటూ అవహేళన!

వాస్తవం ప్రతినిధి: జెంటిల్మెన్ గేమ్ గా చెప్పుకొనే క్రికెట్ లో ట్యాంపరింగ్ చోటుచేసుకోవడం అందులోనూ నెంబర్ వన్ స్థానంలో ఉన్న ఆసీస్ జట్టు ఈ ఘటనకు పాల్పడడం ఒకరకంగా క్రికెట్ అభిమానులకు మింగుడు పడడం లేదు. సక్రమంగా ఆడినప్పుడు ఎంతగా అభిమానిస్తారో ట్యాంపరింగ్ పాల్పడినట్లు స్పష్టమవ్వడం తో అంతకంటే ద్వీషిస్తారు సరిగ్గా అలాంటిదే అనుభవమే ఎదురైంది ఆసీస్ జట్టు లో ఏడాది నిషేదానికి గురైన స్టీవ్ స్మిత్ కు. క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) చేపట్టిన విచారణ ముగియడంతో స్మిత్‌ దక్షిణాఫ్రికా నుంచి  స్వదేశానికి బయలుదేరాడు. ఈ నేపథ్యంలో జొహానెస్‌బర్గ్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న స్మిత్‌ను అక్కడ అభిమానులు స్మిత్‌ను చూసి చీట్‌..చీట్‌అంటూ హేళన చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. మరోపక్క మీడియా కూడా స్మిత్‌ను మాట్లాడాల్సిందిగా కోరింది. దీంతో పోలీసుల సాయంతో స్మిత్‌ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆస్ట్రేలియా కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం సిడ్నీలో స్మిత్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడాల్సి ఉంది. విలేకరుల నుంచి ఎలాంటి ప్రశ్నలు ఎదుర్కొంటాడో… వాటికి స్మిత్‌ ఎలా స్పందిస్తాడో చూడాలి.