సైనిక బడ్జెట్ నుంచే మెక్సికో సరిహద్దు గోడ నిర్మాణం: ట్రంప్

వాస్తవం ప్రతినిధి: మెక్సికోతో సరిహద్దు గోడ నిర్మాణానికి అవసరమైన నిధులను సైనిక బడ్జెట్‌ నుండి ఉపయోగించుకోవాలని యోచిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. మెక్సికో తో సరిహద్దు గోడ నిర్మాణం కూడా దేశ రక్షణ కోసమే అని,కావున సైనిక నిధులతో సరిహద్దు గోడ నిర్మాణం చేపడతానని ట్రంప్ అన్నారు. అయితే దీనికి కాంగ్రెస్‌ అనుమతి అవసరం. గత వారం కుదిరిన వ్యయ బిల్లు నిబంధనల పట్ల ఆగ్రహంతో వున్న ట్రంప్‌ తన హామీ నెరవేర్చుకోవడం కోసం అవసరమైన నిధుల ప్రణాళికపై బుధవారం ప్రతినిధుల సభ స్పీకర్‌ పాల్‌ రియాన్‌తో వైట్‌హౌస్‌లో చర్చించారు. అయితే కాంగ్రెస్‌ అనుమతి లేకపోతే నిధులను మళ్లించే అధికారం ఆయా విభాగాలకు లేదు. దీనిపై తలెత్తిన ప్రశ్నలన్నింటినీ పెంటగన్‌ ప్రతినిధి చిరిస్‌ షేర్‌వుడ్‌ వైట్‌హౌస్‌కు నివేదించారు.