వైభవంగా ప్రారంభమైన ‘ఎన్టీఆర్’ బయోపిక్‌

వాస్తవం సినిమా: తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావుపై తీయనున్న బయోపిక్‌కు ముహూర్తం కుదిరింది. నేటి ఉదయం 9:30 గంటలకు హైదరాబాద్‌లోని రామకృష్ణ స్టూడియోలో ఎన్టీఆర్ ప్రారంభోత్సవ కార్యక్రమం వైభవంగా ప్రారంభమైంది. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభోత్సవం చేశారు. నందమూరి కుటుంబ సభ్యులతోపాటు, సినీ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలిరానుండడంతో రామకృష్ణ స్టూడియోస్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నందమూరి బాలకృష్ణ హీరోగా… ఈ మూవీని ‘ఎన్టీఆర్’ పేరుతో దర్శకుడు తేజ తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ గెటప్‌లో బాలయ్య ఆకట్టుకుంటుండగా… రామకృష్ణ స్టూడియో సందడిగా మారింది. స్టూడియో ప్రధాన ద్వారం వద్ద శ్రీకృష్ణుడి వేషధారణలో ఉన్న ఎన్టీఆర్ నిలువెత్తు కటౌట్‌ను ఏర్పాటు చేశారు. దర్శకుడు తేజ దర్శకత్వంలో బాలకృష్ణ కథానాయకుడిగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే హాట్ టాపిక్‌గా మారిన ఈ సినిమా ప్రారంభోత్సవాన్ని చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున స్టూడియోకు చేరుకుంటున్నారు.