వెనిజులా జైలు లో అగ్నిప్రమాదం….68 మంది మృతి!

వాస్తవం ప్రతినిధి: వెనిజులా లోని కరాబోబో స్టేట్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కరాబో లోని వాలెన్సియా నగరంలోని ఓ జైలు నుంచి ఖైదీలు బయటపడేందుకు చేసిన ప్రయత్నం ఉద్రిక్తతకు దారితీయడం తో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 68 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది. అక్కడి ప్రభుత్వ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కరాబోబో స్టేట్ పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌ అధీనంలోని జైలు నుంచి కొందరు ఖైదీలు బుధవారం తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో జైల్లోని పరుపులకు నిప్పంటించారు. దీంతో అగ్నిప్రమాదం జరిగి 68 మంది మృతిచెందారు. మృతుల్లో ఖైదీలను చూసేందుకు వచ్చిన మహిళలు, చిన్నారులు కూడా ఉన్నట్లు తెలుస్తుంది.  ప్రమాదం గురించి తెలియగానే ఖైదీల బంధువులు జైలు వద్దకు వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఘటనపై కరాబోబో చీఫ్‌ ప్రాసిక్యూటర్‌ తరేక్‌ సాబ్‌ స్పందిస్తూ ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు.