రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సంచలన నిర్ణయాలు 

వాస్తవం ప్రతినిధి:  రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆహార పదార్థాలకు ఉన్న విలువను చాటి చెప్తున్నారు. వృథాను అరికట్టేందుకు గట్టి చర్యలను అమలు చేస్తున్నారు. రాష్ట్రపతి భవన్‌లో అల్పాహారం, అలంకరణలు, అతిథుల విషయంలో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి, ప్రభుత్వ ధనాన్ని ఆదా చేస్తున్నారు.

రాష్ట్రపతి భవన్‌కు వచ్చే అతిథులు, అధికారుల కోసం ప్రతి రోజూ ఐదు రకాల అల్పాహార పదార్థాలను వండటం ఆనవాయితీ. అయితే వీటిలో అత్యధిక భాగం వృథా అవుతున్నాయని రామ్‌నాథ్ కోవింద్ గమనించారు. ఇకపై కేవలం 2 రకాల అల్పాహార వంటకాలను మాత్రమే వండాలని ఆదేశించారు.

రాష్ట్రపతి భవన్‌లోని సమావేశ మందిరాలు, గదుల్లో అలంకరణ కోసం భారీగా పువ్వులను ఉపయోగించేవారు. అంతేకాకుండా తరచూ నిర్వహించే విందులను కూడా బాగా తగ్గించేశారు. మతపరమైన పండుగలను కూడా నిర్వహించడం మానేయాలని ఆదేశించారు. గత ఏడాది దీపావళిని నిర్వహించలేదు. అయితే రాష్ట్రపతి భవన్‌ను మాత్రం అలంకరించారు.

గణతంత్ర దినోత్సవాల సందర్భంగా రాష్ట్రపతి భవన్‌లో జరిగే ‘ఎట్ హోమ్’కు గతంలో దాదాపు 2,000 మంది అతిథులను ఆహ్వానించేవారు, కానీ ఈ ఏడాది వీరి సంఖ్యను 700కు తగ్గించేశారు. రామ్‌నాథ్ కోవింద్ సమీప బంధువులను సైతం ఆహ్వానించలేదు.