మేడమ్ టుస్సాడ్స్ లో కోహ్లీ!

వాస్తవం ప్రతినిధి: భారత పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లీకి అరుదైన గుర్తింపు దక్కింది. దేశ రాజధాని ఢిల్లీ లోని మేడమ్‌ టుస్సాడ్స్‌లో కోహ్లీ మైనపు విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ నేపధ్యంలో కోహ్లీ కి సంబంధించి సుమారు 200 రకాల కొలతలు తీసుకోవడానికి లండన్ నుంచి మేడమ్ టుస్సాడ్స్ ఆర్టిస్టులు వచ్చినట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా భారత్ మెర్లిన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ జనరల్‌ మేనేజర్‌ అన్షూల్‌ జైన్‌ మాట్లాడుతూ....భారత క్రికెట్‌ జట్టు సారథి విరాట్‌ కోహ్లీ మైనపు విగ్రహం ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని వెల్లడించడం ఎంతో ఆనందంగా ఉంది. ప్రతి భారతీయుడికి మదిలో కోహ్లీకి స్థానం ఉంది. అతన్ని ఎంతగానో గౌరవిస్తారు అని తెలిపారు. అలానే కోహ్లీ కూడా దీనిపై స్పందిస్తూ…..మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో నా మైనపు విగ్రహం పెట్టడం నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. నా జీవితంలో ఇది ఎప్పటికీ మరిచిపోలేను. మ్యూజియం నిర్వాహకులకు ధన్యవాదాలు అని తెలిపాడు.