నేటి నుంచి మద్యం షాపుల బంద్..!

వాస్తవం ప్రతినిధి: గుంటూరు జిల్లాలో మద్యం వ్యాపారులు బంద్‌ బాట పట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. రాష్ట్ర వైన్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ ఇచ్చిన పిలుపు మేరకు ఎన్నడూ లేనివిధంగా మద్యం వ్యాపారులు దుకాణాలను మూసి వేసి బంద్‌ పాటించాలని యోచిస్తున్నారు. రాష్ట్రంలోని అనంతపురం, చిత్తూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో మద్యం వ్యాపారులు ఈనెల 28 నుంచి 31 వరకు బంద్‌ చేపట్టనున్నారు. ఈమేరకు 26, 27 తేదీలలో ఐఎంఎల్‌ డిపోల నుంచి మద్యం కొనుగోలును కూడా నిలిపివేశారు. మంగళవారం జిల్లాలోని మద్యం వ్యాపారులు కీలక సమావేశం నిర్వహించారు. ఇప్పటికే రాష్ట్ర అసోసియేషన్‌ ప్రతినిధులు ట్రేడ్‌ మార్జిన్‌ను 16 శాతానికి పెంచాలని ఎక్సైజ్‌శాఖ మంత్రి జవహర్‌కు విజ్ఞప్తి చేశారు. అయితే ప్రభుత్వం స్పందించకపోవడంతో మద్యం వ్యాపారులు బంద్‌ వైపే మొగ్గు చూపుతున్నారు.

జిల్లాలో మొత్తం 183 బార్‌లు, 352 వైన్‌షాపులు ఉన్నాయి. మొత్తం 535 షాపుల్లో రోజుకు 4కోట్ల 25 లక్షల రూపాయల చొప్పును నెలకు రూ.125 కోట్ల నుంచి 130 కోట్ల వ్యాపారం జరుగుతుంది. 2017 జూన్‌ 30 వరకు యావరేజ్‌గా 22 శాతం ట్రేడ్‌ మా ర్జిన్‌ను అప్పట్లో ప్రభుత్వం ఇచ్చింది. ఆ తరువాత 2017-19 ఆర్థిక సంవత్సరానికిగాను రెండేళ్ళ పాటు కాలపరిమితితో 2017 మార్చి 31న డ్రా తీసి మద్యం షాపులకు ఫీజులు కట్టించుకున్నారు. 2017 మార్చి 24న నోటిఫికేషన్‌ జారీ చేసి మద్యం షాపులకు దరఖాస్తులు ఆహ్వానించారు. అయితే మూడు నెలల తరువాత మద్యం షాపులకు లైసెన్సు ఫీజు తగ్గించడంతోపాటు వ్యాపారులకు మిగిలే ట్రేడ్‌ మార్జిన్‌ను కూడా తగ్గించారు. దీంతో అప్పటి నుంచి వ్యాపారులు ట్రేడ్‌ మార్జిన్‌ను పెంచాలని, ప్రభు త్వానికి, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.  2017 జూన్‌ 1 నుంచి అన్ని మద్యం షాపులకు పది శాతం మాత్రమే ట్రేడ్‌ మార్జిన్‌ను నిర్ణయించారు.