దినకరన్ కు సుప్రీం షాక్!

వాస్తవం ప్రతినిధి: అన్నాడీఎంకే బహిష్కృత నేత,అర్కేనగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్‌ కు సుప్రీం షాక్ ఇచ్చింది.   ఆ వర్గానికి ప్రెషర్‌కుక్కర్‌ గుర్తు కేటాయించాలన్న ఢిల్లీ హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించినట్లు తెలుస్తుంది. రెండాకుల గుర్తు కోసం టీటీవీ దినకరన్‌ వర్గం తరఫున గతంలో ఢిల్లీ హైకోర్టులో అప్పీల్‌ దాఖలైంది. అయితే ఈ కేసులో తీర్పు వెలువడే వరకు తమ వర్గానికి తాత్కాలికంగా ఓ పేరు, భవిష్యత్తు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనువుగా ప్రెషర్‌ కుక్కర్‌గుర్తు కేటాయించాలని మధ్యంతర పిటిషన్‌ సమర్పించారు. అయితే కేసు విచారించిన ఢిల్లీ హైకోర్టు దినకరన్‌ వర్గానికి మూడు వారాల్లోపు ప్రెషర్‌ కుక్కర్‌ గుర్తు ఇవ్వాలని, పార్టీ పేరు కేటాయించాలని అప్పట్లో ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. అయితే ఢిల్లీ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం తరఫున సుప్రీంకోర్టులో అప్పీల్‌ దాఖలైంది. అయితే ఈ తాజా పిటీషన్ పై విచారించిన సుప్రీంకోర్టు హైకోర్టు ఆదేశాలపై బుధవారం స్టే విధించినట్లు తెలుస్తుంది. రెండాకులు గుర్తు కేసులో రెండు వర్గాలు అదనంగా పత్రాలు సమర్పించడానికి స్టే విధించడంతో పాటు ఆ కేసు విచారణను మూడు వారాల్లోపు ముగించాలని కోర్టు స్పష్టం చేసింది.