ట్విట్టర్ ద్వారా అభిమానులను క్షమాపణ కోరిన వార్నర్

వాస్తవం ప్రతినిధి: బాల్‌ టాంపరింగ్‌ వివాదంలో కీలక పాత్ర పోషించిన డేవిడ్‌ వార్నర్‌ ఎట్టకేలకు మౌనాన్ని వీడి, ట్విటర్‌ ద్వారా అభిమానులను క్షమాపణలు కోరాడు. క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఐ) ఏడాది నిషేధం విధిస్తూ శిక్ష ఖరారు చేయడంతో స్మిత్‌, వార్నర్‌, బాన్‌క్రాఫ్ట్‌ తిరిగి స్వదేశానికి పయనమయ్యారు. ఈ నేపధ్యంలో జొహానెస్‌బర్గ్‌ నుంచి సిడ్నీకి విమానంలో వెళ్లే సమయంలో వార్నర్‌ తన ట్విటర్‌ ద్వారా క్షమాపణలు కోరుతూ ఓ లేఖను పంచుకున్నాడు. ఆస్ట్రేలియా క్రికెట్‌ అభిమానులతో పాటు యావత్తు ప్రపంచంలోని క్రికెట్‌ అభిమానులారా.. నేను ప్రస్తుతం సిడ్నీకి వెళ్లే దారిలో ఉన్నాను. నేను ఏదైతే చేశానో అది క్రికెట్‌లో చాలా పెద్ద తప్పు. ఇందుకు క్షమాపణలు కోరుతున్నాను. బాధ్యత కూడా వహిస్తున్నాను. నా ఈ చర్యకు అభిమానులు ఎంత బాధపడి ఉంటారో అర్థమైంది. చిన్ననాటి నుంచి నేనెంతో ప్రేమించే క్రికెట్‌కి ఇదో మచ్చ. నా కుటుంబసభ్యులతో, స్నేహితులతో, నమ్మకస్తులతో ఈ ఏడాది సమయాన్ని గడుపుతాను. కొద్ది రోజుల్లో నా నుంచి ఒక వార్త వింటారు అని వార్నర్‌ ఆలేఖ లో  పేర్కొన్నాడు.