జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌08 ప్రయోగం విజయవంతం

వాస్తవం ప్రతినిధి: ఇస్రో మరో ఘన విజయం సాధించింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌థావన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి చేపట్టిన జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌08 ప్రయోగం విజయవంతమైంది. సతీశ్ ధావన్ రోదసీ కేంద్రం నుంచి గురువారం సాయంత్రం 4.56 గంటలకు ఈ ఉపగ్రహాన్ని తీసుకెళ్తున్న జీఎస్ఎల్‌వీ-ఎఫ్08 బయల్దేరింది. 35,900 కి.మీ. దూరంలోని కక్ష్యలోకి ఈ ఉపగ్రహం విజయవంతంగా ప్రవేశించింది. దీని బరువు 2,140 కేజీలు. మూడు దశల్లోనూ జీఎస్‌ఎల్వీ ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. పరస్పరం అభినందనలు తెలుపుకొన్నారు. జీశాట్-6ఏ ఉపగ్రహం జీశాట్-6ను పోలి ఉంటుందని, అయితే ఇందులో కొన్ని మార్పులు చేశామని ఇస్రో అధికారులు చెప్పారు. ఇక ఈ ప్రయోగంలో రాకెట్ రెండో దశలో అధిక విస్పోటనం కలిగిన వికాస్ ఇంజిన్, ఎలక్ట్రోమెకానికల్ ఆక్టేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌08 ద్వారా భారత సైన్యానికి కమ్యూనికేషన్ సర్వీసులు మరింత విస్తృతమవుతాయని పేర్కొన్నారు.