‘జనసేన’ తరపున స్పీకర్ ప్యానెల్ నియామకం

వాస్తవం ప్రతినిధి: జనసేన పార్టీ తరపున స్పీకర్ ప్యానెల్ ను నియమించినట్టు ఆ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈ ప్యానెల్ లో సభ్యులను ఎంపిక చేశారని తెలిపింది. ఈ ప్యానెల్ లో అద్దేపల్లి శ్రీధర్, పార్థసారథి, శివశంకర్, పి.హరిప్రసాద్ ఉన్నారని, టీవీలో నిర్వహించే చర్చా గోష్ఠులు, మీడియా సమావేశాలకు జనసేన తరపున వారు హాజరవుతారని తెలిపింది.

పార్టీ పరంగా మాట్లాడే అంశాలు, వెల్లడించే అభిప్రాయాలకు సంబంధించిన చర్చల్లో మాత్రమే వారు పాల్గొంటారని స్పష్టం చేసింది. మిగిలిన కొత్త సభ్యులకు పార్టీ సిద్ధాంతాలు, విధానాలకు అనుగుణంగా ప్రసంగించేలా తగిన అవగాహన కల్పిస్తున్నామని, జిల్లా, నగర స్థాయుల్లోనూ పార్టీ గళాన్ని వినిపించేందుకు స్పీకర్ ప్యానెల్స్ ను సిద్ధం చేస్తున్నట్టు పేర్కొంది.

కాగా, విజయవాడ నగరానికి సంబంధించిన జనసేన స్పీకర్స్ వివరాలను కొన్ని రోజుల క్రితం పార్టీ ప్రకటించడం తెలిసిందే. మిగిలిన ప్రాంతాలకు సంబంధించిన ‘జనసేన’ స్పీకర్స్ వివరాలను త్వరలో ప్రకటిస్తామని ఆ ప్రకటనలో తెలిపింది .