ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

వాస్తవం ప్రతినిధి: టీడీపీ 37 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నేడు ఘనంగా జరిగాయి. విజయవాడలోని టిడిపి రాష్ట్ర కార్యాలయంలో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత పార్టీ జెండాను ఆవిష్కరించిన మంత్రి యనమల రామకృష్ణుడు అనంతరం మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ……ఎన్టీఆర్,చంద్రబాబు లతో కలిసి పని చేయడం ఎంతో అదృష్టం అని,ఇద్దరూ కూడా అనేక అవకాశాలు కల్పించారని యనమల అన్నారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలతోనే ఉండే పార్టీ తెలుగుదేశమన్నారు. జాతీయస్థాయిలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెలుగుదేశం సాధించిందన్నారు. జాతీయస్థాయిలో కాంగ్రెస్‌ వ్యతిరేక పార్టీలన్నింటినీ ఏకం చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదేనన్నారు. విభజన హామీల సాధన కోసం చెత్తశుద్ధితో కృషి చేస్తున్నామని చెప్పారు. తొలిదశలో కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలిగామని, రెండో దశలో ఎన్డీయే నుంచి బయటకి వచ్చామని చెప్పారు. తర్వాత కూడా దశల వారీ పోరాటం కొనసాగిస్తున్నామన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో మంత్రులు యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమామహేశ్వరరావు, ఎంపీ కొనకళ్ల, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, పంచుమర్తి అనురాధ పాల్గొని మాట్లాడారు. అనంతరం ప్రత్యేక హోదా కోసం తెలుగు యువత దేవినేని చందు నేతృత్వంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు.