ఉత్తర కొరియా తో తమ స్నేహం కొనసాగుతుంది అని చెప్పిన చైనా

వాస్తవం ప్రతినిధి: ఉత్తరకొరియాతో తమ స్నేహబంధం ఇకముందుగా కూడా మరింత పటిష్టంగా కొనసాగుతుందని చైనా అధ్యక్షులు జీ జిన్‌పింగ్‌ ప్రకటించారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ చైనాలో చారిత్రక పర్యటన సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేసినట్లు తెలుస్తుంది. కిమ్‌ జోంగ్‌ కూడా ఇరుదేశాల మధ్య స్నేహసంబంధాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. జిన్‌పింగ్‌ ఇచ్చిన ప్రత్యేక విందు సమావేశంలో అనంతరం కిమ్‌ మాట్లాడుతూ, ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలను కొనసాగించడానికి, ద్వైపాక్షిక సంబంధాలను అభివృద్ధిపరచడానికే తమ పర్యటన ఉద్దేశమని తెలిపారు. పరస్పర పర్యటనలు, ప్రత్యేక దూతలను పంపడం, లేఖలు రాసుకోవడం వంటి చర్యల ద్వారా కిమ్‌తో సంబంధాలు కొనసాగిస్తామని జిన్‌పింగ్‌ తెలిపారు. అణ్వాయుధాలను, దీర్ఘశ్రేణి క్షిపణులను మోహరించడం వల్ల ఇటీవల కాలంలో తలెత్తిన ఉద్రిక్తతలను తగ్గించుకునే ప్రయత్నం జరిగిందని, ఇరు దేశాల మధ్య సుహృధ్భావ సంబంధాలు నెలకొన్నాయని ఇరుదేశాల అధికారిక వార్తా సంస్థలు తమ కథనాల్లో పేర్కొనడం విశేషం. ఇటీవల చైనా లో పర్యటించిన కిమ్ ఉత్తర కొరియా రావలసిందిగా జీ జిన్ పింగ్ ని ఆహ్వానించినట్లు తెలుస్తుంది.