భాజపా పార్టీ టికెట్ పై పోటీ చేయనున్న గాలి!

వాస్తవం ప్రతినిధి: భాజపా పార్టీ టికెట్ పై అక్రమ మైనింగ్ కేసులో నిందితుడు,వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి పోటీ చేయనున్నారట. వచ్చే ఎన్నికల్లో ఆయన భాజపా టికెట్ పై పోటీ చేస్తారని ఆయన తమ్ముడు సోమ శేఖర రెడ్డి చెప్పినట్లు మీడియా లో వార్తలు వస్తున్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నగారా మోగిన సంగతి తెలిసిందే. మే 12న రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. కాగా.. ఈ ఎన్నికలు అధికార కాంగ్రెస్‌, భాజపాకు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. ఇప్పటికే రెండు పార్టీలు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టాయి. ఇదిలా ఉండగా.. ఇప్పుడు కర్ణాటక ఎన్నికలకు సంబంధించి ఈ ఆసక్తికర వార్త స్థానిక మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఎన్నికల్లో భాజపా టికెట్‌పై బళ్లారి నుంచి పోటీ చేయనున్నట్లు సమాచారం. అయితే దీనిపై అటు పార్టీ నుంచి గానీ.. ఇటు గాలి జనార్దన్‌ రెడ్డి నుంచి గానీ ఎలాంటి అధికారిక సమాచారం లేదు.