తల్లిదండ్రులను నిందించడం భారతీయ సంప్రదాయమా?

వాస్తవం ప్రతినిధి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చనిపోయిన తన తల్లిదండ్రులను నిందించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటులో పరిణామాలపై చర్చించేందుకు తెలుగుదేశం పార్టీ ఎంపీలతో బుధవారం ఉదయం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళవారం ఢిల్లీలో విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఒక తల్లికి, ఒక తండ్రికి పుట్టినవారు చంద్రబాబులా మాట్లాడరంటూ తనపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ప్రస్తావించారు.
ఎవరికైనా తల్లిదండ్రులు దైవంతో సమానమని… చనిపోయిన తన తల్లిదండ్రుల గురించి నీచంగా మాట్లాడతారా? అంటూ మండిపడ్డారు. ఎవరి తల్లిదండ్రులనైనా నిందించడం భారతీయ సంప్రదాయమా? అని ప్రశ్నించారు. ప్రధాని కాళ్లకు మొక్కడం భారతీయ సంప్రదాయమా? అని నిలదీశారు. ఇటువంటి వాళ్లను ప్రధాని కార్యాలయం చేరదీస్తోందన్నారు. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు దుర్మార్గానికి పరాకాష్ట అన్నారు. రాష్ట్రానికి న్యాయం చేయమంటే తనపై బురద జల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే చర్యలను సహించేది లేదు. రహస్యంగా ఎవరితో మంతనాలు జరపొద్దు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. విజయసాయిరెడ్డి చర్యలు, వ్యాఖ్యలను అందరూ గమనిస్తున్నారు. ఇది ఐదు కోట్ల ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉన్న అంశం’ అని పార్టీ ఎంపీలకు చంద్రబాబు స్పష్టం చేశారు.