జీశాట్‌-6ఏ ఉపగ్రహ ప్రయోగానికి కౌంట్‌డౌన్ ప్రారంభం

వాస్తవం ప్రతినిధి: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్‌ నుంచి గురువారం సాయంత్రం 4.56 గంటలకు జీఎస్‌ఎల్వీ-ఎఫ్‌08 రాకెట్‌ ద్వారా జీశాట్‌-6ఏ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనుంది. బెంగళూరులోని ఉపగ్రహ తయారీ కేంద్రం నుంచి జీశాట్-6ఏను రోడ్డు మార్గం ద్వారా అత్యంత భారీ భద్రత నడుమ ప్రత్యేక వాహంలో శ్రీహరికోటకు తరలించారు. 2,140 కిలోల బరువున్న జీశాట్-6ఏ ఉపగ్రహం సమాచార రంగానికి చెందింది. దేశంలో కమ్యూనికేషన్ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ఇస్రో ఈ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తోంది. ఈ ప్రయోగం విజయవంతమైతే పదేళ్ల పాటు సేవలు అందించనుంది. ఉపగ్రహ ప్రయోగానికి సంబంధించి 27 గంటల కౌంట్‌డౌన్ బుధవారం మధ్యాహ్నం 1.56 నిమిషాలకు ప్రారంభమవుతుందని ఇస్రోకు చెందిన మిషన్ రెడీనెస్ రివ్యూ కమిటీ మంగళవారం వెల్లడించింది.