వాస్తవం ప్రతినిధి: ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ చైనా పర్యటనపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. రెండు రోజుల క్రితం పచ్చ రంగు రైలు చైనా లో కనిపించిందని అది కిమ్ ఫ్యామిలి ఉపయోగించే రైలు అని అనుమానాలు వ్యక్తం అయిన సంగతి తెలిసిందే. అయితే కిమ్ చైనాలో పర్యటించడం నిజమేనని.. అయితే అది అనధికారిక పర్యటన మాత్రమేనని చైనా, ఉత్తరకొరియా తమ అధికారిక మీడియా ద్వారా తాజాగా వెల్లడించాయి. గత ఆదివారం తన భార్య రి సోల్ జుతో కలిసి చైనా వచ్చిన కిమ్ నిన్న ఆ దేశాధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో భేటీ అయినట్లు తెలుస్తుంది.
బీజింగ్‌లోని గ్రేట్ హాల్ ఆఫ్ ది పీపుల్ భవనంలో వీరిద్దరూ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బీజింగ్‌కు వచ్చిన కిమ్ దంపతులకు.. జిన్‌పింగ్ దంపతులు సాదర స్వాగతం పలికారు. అనంతరం వీరి కోసం ప్రత్యేక విందు కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇరు దేశాల సత్సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు చైనా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని జిన్ చెప్పినట్లు ఉత్తరకొరియా మీడియా పేర్కొంది. అంతేగాకఉత్తరకొరియా రావాలని కిమ్ ఆహ్వానించగా అందుకు జిన్‌పింగ్ ఒప్పుకున్నట్లు మీడియా తెలిపింది.