గాంధీ హత్యాంశాన్ని పునర్విచారించాల్సిన అవసరం లేదు: సుప్రీం

వాస్తవం ప్రతినిధి: మహాత్మాగాంధీ హత్యా అంశాన్ని పునర్ విచారించాలని వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. 70 ఏళ్ల తర్వాత ఈ కేసు విచారణను తిరిగి ప్రారంభించడానికి ఎటువంటి సహేతుక కారణాలు కనిపించడం లేదని జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే, ఎల్‌. నాగేశ్వరరావుతో కూడిన ధర్మాసనం వెల్లడించింది.  ముంబైకి చెందిన పంకజ్ ఫడ్నిస్ అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేయగా, దానికి సుప్రీం కోర్టు ఆ పిటీషన్ ని కొట్టిపారేసింది. మనోభావాల ఆధారంగా మహాత్మా గాంధీ హత్యను పరిశీలించలేమని కోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. మనోభావాల ఆధారంగా కేసును పరిశీలించలేమని, కానీ చట్టపరమైన ఆధారాలను పరిగణలోకి తీసుకుంటామని పేర్కొన్నది. గాంధీపై నాలుగో బుల్లెట్‌ను కూడా కాల్చారని.. ఈ బుల్లెట్‌ కారణంగానే గాంధీ ప్రాణాలు కోల్పోయారని.. ఇందులో విదేశీ ఏజెన్సీల హస్తం ఉందని  పిటిషనర్‌ ఆరోపించాడు.  అయితే ఈ వాదనలను కోర్టు తిరస్కరించింది. ఈ కేసులో పిటిషనర్‌ చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని గాంధీ హత్య కేసు విచారణకై అమికస్‌ క్యూరీగా నియమించిన మాజీ అడిషనల్ సొలిసిటర్ జనరల్ అమరేంద్ర శరణ్‌ కోర్టుకు నివేదిక సమర్పించారు. ఈ కేసులో తిరిగి విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. దీంతో కోర్టు కూడా ఆ నివేదిక తో ఏకీభవించింది.