కావేరీ యాజమాన్య మండలిని కేంద్రం తప్పక ఏర్పాటు చేస్తుంది: పళని

వాస్తవం ప్రతినిధి: కావేరీ యాజమాన్య మండలిని ఏర్పాటు చేయాలని గత కొద్ది రోజులుగా పార్లమెంట్ లో అన్నాడీఎంకే పార్టీ ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళని స్వామి మాట్లాడుతూ…కావేరీ యాజమాన్య మండలిని కేంద్రప్రభుత్వం తప్పక ఏర్పాటు చేస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. మంగళవారం జరిగిన వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. అలానే కావేరీ ట్రైబ్యునల్‌ తీర్పును గెజిట్‌లో విడుదల చేయించేందుకు జయలలిత కృషి చేశారని  ప్రస్తుతం యాజమాన్య మండలి ఏర్పాటుకు  తమ వంతు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. యాజమాన్య మండలి ఏర్పాటుకు సుప్రీంకోర్టు విధించిన గడువు త్వరలో పూర్తి కానుందని, ఈ వ్యవహారంలో తమ ప్రయత్నాలను వేగవంతం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే అన్నాడీఎంకే పార్లమెంటు సభ్యులు ప్రధానిని కలిసి చర్చించిన విషయాన్నీ ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.