ఆ ముగ్గురిపై వేటు పడింది!

వాస్తవం ప్రతినిధి: బాల్ ట్యాంపరింగ్ వివాదం ఆసీస్ క్రికెట్ ను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ట్యాంపరింగ్ కి పాల్పడడమే కాకుండా అదంతా సమిష్టి జట్టు నిర్ణయం అని నిసిగ్గుగా తెలిపిన ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు అభిమానులు. అయితే ఈ బాల్‌ టాంపరింగ్‌ ఉదంతంలో ముగ్గురే దోషులని ఆ దేశ క్రికెట్‌ బోర్డు తేల్చిసింది. క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) నిర్వహించిన ప్రాథమిక విచారణలో కెప్టెన్‌ స్టీవెన్‌ స్మిత్‌, వైస్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌, కామెరూన్‌ బాన్‌క్రాఫ్ట్‌ లను బాధ్యులుగా నిర్ధారించి ఇంకెవరికీ ఇందులో పాత్ర లేదని సీఏ స్పష్టం చేసింది. కోచ్‌ లీమన్‌కు కూడా ఈ ఉదంతంతో సంబంధం లేదని , ఈ నేపధ్యంలో దోషులుగా భావిస్తున్న ఆ ముగ్గురినీ తక్షణం జట్టు నుంచి తప్పిస్తూ సీఏ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.  ఈ క్రమంలో స్మిత్‌, వార్నర్‌, బాన్‌క్రాఫ్ట్‌ ఈ రోజే దక్షిణాఫ్రికా నుంచి స్వదేశానికి బయల్దేరనున్నారు. వీరి స్థానంలో నాలుగో టెస్టు కోసం రెన్‌షా, గ్లెన్‌ మాక్స్‌ వెల్‌, జో బర్న్స్‌ లను తీసుకున్నట్లు సమాచారం.  టాంపరింగ్‌ ఉదంతం బయటపడడం తో మూడో టెస్టు మధ్యలోనే స్మిత్‌ నుంచి నాయకత్వ బాధ్యతలు చేపట్టిన వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌ మన్‌ టిమ్‌ పైన్‌ ఇక నాలుగో టెస్టుకు పూర్తి స్థాయిలో పగ్గాలు అప్పగించింది సీఏ. టాంపరింగ్‌ ఉదంతంపై స్వయంగా ఆస్ట్రేలియా ప్రధానే ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆఘమేఘాల మీద దక్షిణాఫ్రికాకు బయల్దేరి వచ్చిన సీఏ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ జేమ్స్‌ సదర్లాండ్‌.. మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించి ఈ విషయాలు వెల్లడించారు.