ఆంక్షలు విధించడం లో చేయి కలపాల్సిందిగా న్యూజిలాండ్ పై బ్రిటన్ ఒత్తిడి

వాస్తవం ప్రతినిధి: రష్యాపై ఆంక్షలు విధించడంలో చేతులు కలపాల్సిందిగా న్యూజిలాండ్‌ ప్రభుత్వంపై బ్రిటన్‌ ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తుంది. బ్రిటన్‌లో రష్యా మాజీ గూఢచారులపై విష ప్రయోగం జరిగిందనే సాకుతో రష్యాపై ఆంక్షలు విధించాలని బ్రిటన్‌, దాని మిత్రపక్షాలు భావిస్తున్నాయి. ఈ నేపధ్యంలో న్యూజిలాండ్‌లో బ్రిటన్‌ హై కమిషనర్‌ లారా క్లార్కె ను ఈ మేరకు హెచ్చరించినట్లు సమాచారం. విష ప్రయోగం విషయంలో తాము బ్రిటన్‌కు సంఘీభావంగా వుంటామని గత వారమే యురోపి యన్‌ యూనియన్‌ విదేశాంగ మంత్రులు వాగ్దానం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో క్లార్కే రేడియో న్యూజిలాండ్ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ……..రష్యా తో స్వేచ్చా వాణిజ్య ఒప్పందానికి ప్రయత్నిస్తున్న న్యూజిలాండ్ భవిష్యత్తు లో ఇయు, బ్రిటన్ లతో కుదుర్చుకొనే ఒప్పందాలన్నీ ప్రమాదంలో పడతాయంటూ హెచ్చరించింది. రష్యా కన్నా ఇయు, బ్రిటన్‌లతో వాణిజ్య చర్చలకే న్యూజిలాండ్‌ ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె కోరారు. క్లార్కె రేడియో ఇంటర్వ్యూ ముగిసిన తర్వాత న్యూజిలాండ్‌ ప్రధాని జసిండా ఆర్డెన్‌ మాట్లాడుతూ, రష్యాతో వాణిజ్య చర్చలను తిరిగి ప్రారంభించాలన్న ప్రయత్నాలను విరమించుకున్నట్లు ప్రకటించారు. 2014లో క్రిమియా విషయమై ఈ చర్చలు నిలిచిపోగా, ఇప్పుడు తాజాగా ఇయు,బ్రిటన్ ల వల్ల ఈ చర్చలు మరోసారి నిలిచిపోనున్నాయి.