అఖిల్ తో యాక్షన్ లవ్ స్టోరీని తెరకెక్కిస్తానంటూ వర్మ వివరణ

వాస్తవం సినిమా: అక్కినేని వారసుడు అఖిల్ తన మూడో సినిమాను ఈ మధ్యే లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్‌ ఈ చిత్రంలో నటిస్తున్నారు. మంగళవారం ఈ సినిమా ప్రారంభమైంది. అఖిల్‌పై ముహూర్తపు సన్నివేశానికి నాగార్జున క్లాప్‌ కొట్టారు. ఈ నేపథ్యంలో వర్మ అఖిల్‌ గురించి ట్విటర్‌లో చెబుతూ… నేను తెరకెక్కించిన ‘శివ’ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరించారు. దాదాపు 25 ఏళ్ల తర్వాత నా దర్శకత్వంలో నాగ్‌ నటిస్తున్న‘ఆఫీసర్‌’ సినిమాకు నేనే నిర్మాతగా వ్యవహరిస్తున్నాను. ఇప్పుడు నాగార్జున నిర్మాతగా అఖిల్‌ ఓ చిత్రం చేయబోతున్నాడు. దీనికి నేనే దర్శకుడిని. నాగ్‌..నువ్వు నన్ను సైకిల్‌ చెయిన్‌తో కొట్టినా నిజాయతీగా ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. ‘శివ’ సినిమా సమయంలో నీకున్న స్టైల్‌, వాయిస్‌ కంటే ఇప్పుడు అఖిల్‌ వాయిస్‌, స్టైలే బాగున్నాయి. ఓ దర్శకుడిగా అఖిల్‌ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నాను. నిర్మాతగా నువ్వూ నా విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. అఖిల్‌తో తీయబోయే చిత్రం క్యూట్‌ లవ్‌స్టోరీ కాదు. యాక్షన్‌ ఘట్టాలతో రియలిస్టిక్‌ యాక్షన్‌ చిత్రంలా ఉండబోతోంది. ప్రేమ, యాక్షన్‌ సన్నివేశాలు ఉన్న ఓ బలమైన కథతో తెరకెక్కిస్తున్నాం.’ అని ట్వీట్‌ చేశారు వర్మ. అయితే అఖిత్‌తో సినిమా చేయబోతున్నట్లు వర్మ ఇంతకుముందు ఎన్నడూ ప్రకటించింది లేదు. ఉన్నట్టుండి ఈ విషయాలన్నీ ఇప్పుడు ఎందుకు వెల్లడించారో ఆయనకే తెలియాలి.